మతం యొక్క ప్రయోజనమేమిటి? •

దీనికి వివిధ మతాలు వివిధ సమాదానాలిస్తున్నవి. మానవుణ్ణి దేవునికి సన్నిహితం చేసి తద్వారా ఆత్మకు ముక్తి కల్గించడమే మతం యొక్క ప్రయోజనమన్నది మాత్రం సామాన్యంగా లభించే సమాధానం.  • మూడు రాజ్యాలు(లోకాలు) ఉన్నాయని చాలా మతాలు చెబుతాయి. ఒకటి స్వర్గ రాజ్యం, రెండు భూ రాజ్యం, మూడవది నరక రాజ్యం • స్వర్గ రాజ్యాన్ని దేవుడే పాలిస్తుంటాడు. నరక రాజ్యానికి సైతాను అధిపతి. అయితే భూ రాజ్యాన్ని పాలించేదెవ్వరన్న విషయం మాత్రం వివాదాస్పదంగానే మిగిలిపోయింది. భూరాజ్యానికి దేవుని ఆదిపత్యమూ, యముని ఆదిపత్యమూ లేదు. అది ముందు జరుగుతుందేమోనని ఆశిస్తుంటారు. • స్వర్గ రాజ్యాన్ని సరాసరి దేవుడే పరిపాలిస్తున్నాడు కాబట్టి అది సద్ధర్మ రాజ్యమై ఉంటుందని వారి భావన. • కొన్ని మతాల ప్రకారం స్వర్గమనేది భూమిపై లేదు. స్వర్గమన్నది వేరు. దేవుణ్ణి, దేవుని ప్రవక్తను నమ్మినవారు మాత్రమే స్వర్గానికి పోగాలుగుతారనీ, ఆ మత విశ్వాసకులు మాత్రమే ఆ స్వర్గం చేరి వారు కోరిన అన్ని సుఖాలను అనుభవించగలరని వారి నమ్మకం. • అనేక మతాల యొక్క అంతిమ ధ్యేయం మానవుడు స్వర్గం చేరుకోవడం ఎలాగన్నదే. అయితే, మతం యొక్క ప్రయోజనమేమిటన్న ప్రశంకు బుద్దుడిచ్చిన సమాధానం పై విశ్వాసాలకు పూర్తిగా భిన్నమైనది. • స్వర్గమనేది భూమి పైనే ఉన్నదనీ, మానవులు సద్ధర్మాన్ని అభ్యసిం చినపుడే భూమి స్వర్గమౌతుందని బుద్ధుడు చెప్పాడు. • మానవులలో నెలకొని ఉన్న దుఃఖాన్ని తొలగించాలంటే మానవులందరూ ధార్మికంగా జీవించాలి. ప్రతి ఒక్కరూ సాటి వ్యక్తి పట్ల చక్కగా మెలగగలిగినట్లయితే ఈ ప్రపంచమంతా సద్ధర్మ రాజ్యం కాగలదని బుద్ధుడు బోధించాడు. • పంచశీల, అష్టాంగ మార్గం, పార్మితల యొక్క ప్రాధాన్యతను బౌద్ధ ధర్మం వివరిస్తుంది. (ఆధారం: బుద్ధుడు-బౌద్ధ ధమ్మము రచన: డా. బి.ఆర్. అంబేద్కర్ అనువాదం: డా. యెండ్లూరి)

*అనాథ పిండకునికి ధర్మ దీక్ష ఇచ్చే సందర్భంలో బుద్ధుని ధర్మ ప్రబోధం*

అనాథ పిండకుడు కోసల రాజు కోశాధికారి. ఇతని అసలు పేరు సుదత్తుడు. పేదల పట్ల ఔదార్యం చూపుతుండేవాడు. కనుక, ఇతనిని అనాథపిండకుడని పిలుస్తారు. బుద్ధుడు ఇట్లా ధర్మ బోధ చేశాడు. • “మన జీవితాలకు రూప కల్పన చెసినదెవ్వరు? ఇది ఈశ్వరుడే సృష్టించాడందామా? అదే వాస్తవమైనట్లయితే సకల జీవరాసులు ఆ సృష్టికర్త అదుపు ఆజ్ఞలకు లోబడి తీరవలసిందే. అనగా కుమ్మరి బండి చక్రంపై ఎన్నో రకాల వస్తువుల్ని తయారు చేయగలిగినట్లే ఈ సకల్ జీవరాసులు సృష్టింపబడినాయన్నమాట. అదే వాస్తవమైనట్లయితే ఈ దుఃఖం, ఈ బాధ, ఈ పాపం ఉండేందుకు అవకాశమే లేదు. ఎందుచేతనంటే మనం చేసే మంచి చెడు కార్యాలకు ఈశ్వరునిదే బాధ్యతగదా! ఈ వాదం వాస్తవం కాదనుకొన్నట్లయితే స్వయంభువు అనబడే ఆ ఈశ్వరుడే లేడుగదా! ఆ ప్రకారం ఆలోచించినట్లయితే ఈ ఈశ్వరవాదమే తలక్రిందులవుతుంది.  • చెట్టు మొలకేత్తేందుకు విత్తనం కారణమైనట్లే సృష్టి లోని ప్రతిదానికి ఒక కారణమంటు ఉండి తీరాలి. అతీత శక్తి అన్నింటిలోను ఉన్నదనుకొన్నట్లయితే వాటి సృష్టికి అదే హేతువు కాజాలదు.  • స్వయంభువుడే సమస్త జీవరాసులని సృష్టించాడనుకొన్నట్లయితే ఆహ్లాదకరమైనట్టి వాటినే ఎందుకు సృష్టించకూడదు? ఈ దుఃఖానికి, సుఖానికి గల కారణాలు మనకు కనిపిస్తున్నవి. మరి వాటిని ఎందుకు సృష్టించాడు? • ఈ సుఖ దుఖాలకు మన అదృష్టమే కారణంగాని అతీత శక్తి కారణం కాదనుకొన్నట్లయితే మన స్థితిగతులను మేతుగు పరచుకోవాలనుకోవడం వృధా ప్రయత్నంగదా? ఎలా జరగాలో అలా జరిగి తీరుతుందనుకొంటే మానవ ప్రయత్నానికి ఆస్కారమెక్కడున్నది? • ఈ వాదాన్ని బట్టి చూచినట్లయితే సృష్టిలోగల ప్రతిదానికి మూలకారణంఉండి తీరాలి. అతీత శక్తి ఈ సృష్టికి కారణం కాజాలదు. మనం చేసే మంచీ చెడు కార్యాలను బట్టే వాటి ఫలితాలు కూడ ఆధారపడి ఉంటాయని విశదమవుతున్నది. • ప్రపంచంలో గల ప్రతిదానికి ఒక ప్రేరక శక్తి కారణమై ఉంటుంది. బంగారంతో చేయబడిన పాత్రలో ఏ భాగానికైన బంగారమే మూలకారణమైనట్లే దాని సృష్టికి దాని మూలధాతువే కారణమై ఉండి తీరాలి. • పై దృష్ట్యా ఊహాజనిత విషయాలకు నిష్ప్రయోజనకరమైన నమ్మకాలకు స్వస్తి చెప్పడం మేలు. స్వార్థాన్ని విడనాడి మంచి పనులే చేయడం నేర్చుకొన్నట్లయితే వాతో వలన మంచి ఫలితాలు తప్పక కలిగి తీరుతాయి. • అష్టాంగ మార్గ సూత్రాలను ఆచరించగలిగిన వారెవ్వరైన నిర్వాణానందాన్ని పొందగలుగుతారు. సంపదలు కలవాడు ఆ సంపదలకే అంటి పెట్టుకొని ఉన్నట్లయితే అవి తన హృదయాన్ని విషపూరితం చేస్తాయి. కాని సంపదలు కలిగి ఉన్న వాడు వాటికి అంటిపెట్టుకొని ఉండకుండ వాటిని సాటి మానవుల శ్రేయస్సుకై  వినియోగించగలిగితే అవి సద్వినియోగమవుతాయి. • నేను నీకు చెప్పదలచినదేమంటే నీవు నీ వ్యాపారాలను(పనులను) ఎంతో దీక్షా దక్షతలతో నిర్వహించు. జీవితానికి ఐశ్వర్యానికి అధికారానికి అంటి పెట్టుకొని ఉండడం వలననే ఒకడు వాటికి బానిస కాగలడుగాని వాటిని కలిగియున్నంత మాత్రాన బానిస కాజాలడు. • భిక్షువులు ప్రాపంచిక సుఖాలను విదనాడినంత మాత్రాన తీరికగా కూర్చుండిపొతే దానివలన ఫలితముండజాలదు. ఎందుకంటే సోమరితనం ఎంతో నిరసించదగినది. తేవారా ఏర్పడే శక్తి హీనత నిందితమైనది. • ప్రతి ఒక్కరూ గృహస్త జీవనాన్ని విడనాడాలన్నది తథాగతుని ధర్మ విధానం కాదు. అలాంటి జీవనాన్ని అభిలషించే వారే అలా చేయవచ్చు. అయోతే తథాగతుని ధర్మం కోరుతున్నదేమనగా మానవుడు స్వార్థాన్ని విడనాడాలి. సద్ధర్మ మార్గంలో పయనించాలి. • ఒకడు శ్రామికుడు కావచ్చు. మరొకడు రాజోద్యోగి కావచ్చు. మరొకడు సమస్త వ్యాపకాలు విడనాడి ధ్యాన నిష్టలోనే కాలం గడుపుతూ ఉండవచ్చు. ఎవరెవరికే వృత్తులు వ్యాపకాలు ఇష్టమో వాటిని శక్తి కొలదీ దక్షతతో నిర్వహించడం చాలా అవసరం. కాని అవే తన సర్వస్వమైనట్లు వాటికంటుకొని పోరాదు. నీటిలోనే ఉంటున్న తామర నీటినెలా అంటకుండ వుండగలుగుతుందో ఆ విధంగానే ప్రాపంచిక వ్యాపకాలలో జీవిస్తున్నప్పటికీ అసూయ, ద్వేషం లేకుండా ఉండగలిగినట్లయితే వారి జీవితం ప్రాశాంతంగా వుంటు చివరికి నిర్వాణానందం పొందగలుగుతారు. (ఆధారం: బుద్ధుడు-బౌద్ధ ధమ్మము రచన: డా. బి.ఆర్. అంబేద్కర్ అనువాదం: డా. యెండ్లూరి)